The Struggle for a Photograph

1992, February నెల… కొలిమిగుండ్ల గ్రామం, కర్నూలు జిల్లా … ఒక చిన్న వీధి… మిట్ట మధ్యాహ్నం… పది/ పదకొండు సంవత్సరాల బాలుడు… కాళ్ళకు చెప్పులు కూడా లేవు… బజారు చప్పట మీద అటూ – ఇటూ నడుస్తూ వున్నాడు. ఫిబ్రవరి నెల అయినప్పటికీ ఎండలు ఎక్కువగానే వున్నాయి. రాయలసీమ కదా! ఎండలు బాగా వుంటాయి. ఆ బాలుడు నల్లటి నాపరాళ్ల మీద నిలబడలేక … కాళ్ళను మార్చి మార్చి నిలబడుతూ ఉన్నాడు. దూరం నుండి చూస్తే ఆడుకున్నట్టు కనబడుతూ ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ అబ్బాయి వేగంగా అడుగులు మారుస్తూ వున్నాడు. ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు… ఎండకు నల్లటి నాపరాళ్ళ బండ పరుపు నిగనిగలాడుతూ ఉంది. వాటి మీద నిలబడటం అంటే కాళ్లకు బొబ్బలు రావటమే; ఐదు నిమిషాలు కూడా నిలబడలేరు… అంత వేడెక్కుతాయి ఆ రాళ్ళు… ఇంక మిట్ట మధ్యాహ్నం అయితే చెప్పవలసిన అవసరమే లేదు.. గజం రాయి… గజం రాయి కి మధ్య ఉండే చిన్న గ్యాప్.. ఆ గ్యాప్ మీద పాదాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి… ఎండకు రాళ్ల మీద నిలబడలేక…. ఆ లేత పాదాలను రాళ్ల మధ్యలో ఉండే చిన్న గ్యాప్ మీద వుంచి, కాళ్లు కాలకుండా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు… మధ్యలో తలెత్తి పైకి చూస్తూ ఉన్నాడు… సూర్యుడి వైపు, ఎదురుగా ఉన్న ఇంటి తలుపు వైపు… అప్పటికి దాదాపుగా నలభై నిమిషాలు అయ్యింది… భగ భగ మండే ఎండలు… కింద కాళ్ళు కాలుతూ ఉన్నాయి… పైన తల వేడెక్కుతుంది. తప్పించుకోవడానికి చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చిన్న చెట్టు కానీ ఇతర నీడకానీ లేదు. ఆ అబ్బాయి ఇంటి ద్వారం వైపు చూస్తూ నలభై నిమిషాల నుండి అటూ – ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక నలభై నిమిషాల తరువాత ఒక మధ్యస్త వయస్సు వ్యక్తి ఆ ఇంటి నుండి బయటకు వచ్చాడు. “ఇక్కడ… ఇక్కడ వచ్చి నిలబడు” అంటూ తన ఎదురుగా వున్న రాయి మీద వచ్చి నిలబడమని, ఒక రాయి వైపు చూపించాడు. ఆ అబ్బాయి వెంటనే వెళ్లి అతను చూపించిన రాయి మీద నిలబడ్డాడు. అతను తన కెమెరాను సరి చేసుకుంటూ ఉన్నాడు. అతను ప్యాంటు, షర్టు వేసుకుని ఓ మోస్తరుగా వున్నాడు. కాళ్ళకి slippers కూడా వేసుకుని వున్నాడు. అప్పటికే అక్కడ 40 నిమిషాలు ఎండలో ఉండేసరికి, అటు తల – ఇటు కాళ్ళు విపరీతంగా కాలుతున్నాయి. అయినా అతను చెప్పిన స్థలానికి వచ్చి నిలబడ్డాడు ఆ అబ్బాయి. వేడికి తాళలేక కాళ్ళు మాటిమాటికీ మార్చుకుంటూ ఉన్నాడు. ఒక కాలు మార్చి ఒక కాలు మీద నిలబడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. “ఫోటో తీయాలంటే కుదురుగా నిలబడాలి” అని ఆ అబ్బాయిని అన్నాడు అయన. అబ్బాయి అంత సేపు ఎండలో నిలబడ్డాడు కాళ్ళు మండిపోతూ వుంటాయి అనే ధ్యాస లేదు అతనికి. భగ భగ మండే ఎండలో అప్పటికే పాదాలు విపరీతంగా కాలుతున్నా, ఫోటో తీయించుకోవడం కోసం ఆయన చెప్పిన నాపరాయి మీద కదలకుండా నిలబడ్డాడు ఆ అబ్బాయి. ఆ వ్యక్తి అబ్బాయిని ఫోటో తీసే ముందు “ నవ్వు !” అన్నాడు. పాదాలు కాలుతున్నా, ఆ బాధను భరిస్తూ ఏడవలేక నవ్వాడు ఆ అబ్బాయి. ఫోటో క్లిక్ మనిపించి తన కెమెరాను తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆయన. వెళ్తూ వెళ్తూ “ఇది డెవలప్ చేయడానికి రెండు రోజులు పడుతుంది. ఇప్పుడు పది రూపాయిలు ఇవ్వు, ఎల్లుండి వచ్చి ఫోటోని తీసుకో” అన్నాడు. ఆ అబ్బాయి “సరే అండి” అంటూ, జేబు లో నుంచి ఆయన అడిగిన డబ్బులు తీసి ఇచ్చాడు.

“నాన్న ! ఈ రోజు మా మాస్టారు నన్ను మెచ్చుకున్నారు… స్కూల్లో బాగా చదువుతున్నానని” ఆనందంగా తండ్రి వెంకటన్న కి చెప్పాడు ఆ అబ్బాయి. “ మంచిది ఇంకా ఏం చెప్పారు ? ”

“ఏదో application చూపించాడు, దానికి apply చేయాలి అన్నారు… దాని కోసం రెండు passport size ఫోటోలు తీసుకుని రమ్మన్నారు” “ఫోటోలు ఎక్కడ నుంచి వస్తాయి? మన దగ్గర లేవు కదా? మన ఊర్లో ఫోటో స్టూడియో కూడా లేదు… ఎలా చేయాలో ఏమో? సరేలే నేను కనుక్కుంటాను” వెంకటన్నకు మనసు ఆగలేదు… వెంటనే ఊర్లోకి బయలుదేరాడు… వారిని వీరిని అడిగి… అబ్బాయికి ఫోటో ఎక్కడ తీస్తారో కనుక్కున్నాడు. కోటపాడులో ఫోటో స్టూడియో లేదు… దగ్గరలో మండల head quarters అయిన కొలిమిగుండ్లలో ఉంది… అక్కడికి వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి… వెళ్లి రావాలంటే ఒక రోజంతా పడుతుంది అని తెలిసింది. ఇంటికి వచ్చి కొడుక్కి చెప్పాడు, “ నీకు ఫోటో తీసుకోవాలంటే కొలిమిగుండ్ల లో మాత్రమే షాపు ఉందట. అక్కడికి వెళ్లి తీసుకోవాలి… నేను రాలేను… నేను వస్తే నాకు వచ్చే ఒకరోజు కూలీ పోతుంది… మనం వున్న ఆర్థిక పరిస్థితికి, అది నేను చెయ్యలేను… నువ్వు ఒక్కడివే వెళ్లి రావాలి… మీ స్కూల్లో ఎవరికైతే ఫోటో కావాలో వారితో పాటుగా నువ్వూ వెళ్లి తెచ్చుకో ” అని అబ్బాయికి సర్ది చెప్పాడు.

“రాజా, విష్ణు, ఆ అబ్బాయి – ముగ్గురూ బాగా చదువుతారు. వీరి ముగ్గుర్నీ నవోదయ స్కూలుకు పంపిద్దాం. దానికి apply చేయాలంటే ఫోటోలు కావాలి” పుల్లయ్య మాస్టారు వారి తల్లిదండ్రులకు, ఆ అబ్బాయి నాన్నకు స్కూలుకు పిలిచి చెప్పిన మాటలు. రాజా, విష్ణు, ఆ అబ్బాయి కి మంచి మిత్రులు కూడా. వారి ఫోటోలు తీయించడానికి వారి అబ్బ (రాయలసీమ లో నాన్న తల్లితండ్రులను జేజీ-అబ్బ అనీ,తల్లి యెక్క తల్లీదండ్రులను అవ్వ-తాత అనీ అంటారు) వారిని తీసుకొని వెళుతున్నారని వారితో పాటు ఆ అబ్బాయి కూడా బయలుదేరాడు. కోటపాడుకు బస్సు సౌకర్యం లేదు. కోటపాడు నుండి మండల కేంద్రమైన కొలిమిగుండ్ల కు వెళ్లాలంటే రెండు బస్సులు మారి వెళ్ళాలి. కోటపాడు నుంచి పేరుసోముల రోడ్డు వరకు కాలినడకన రావాలి… ఇది దాదాపు ఒక ఎనిమిది వందల మీటర్లు వుంటుంది. పేరుసోముల నుండి తిమ్మనాయునిపేట ఆరు కిలోమీటర్లు. అక్కడినుండి కొలిమిగుండ్ల పద్నాలుగు కిలోమీటర్లు. జేబులో నాన్న ఇచ్చిన డబ్బులు పెట్టుకొని పేరుసోముల రోడ్డు మీదుగా వచ్చి వెయిట్ చేసాడు ఆ అబ్బాయి. కొద్దిసేపటికి రాజా, విష్ణు, వారి అబ్బ-పెద్ద వెంకట్రామి రెడ్డి వచ్చారు అక్కడికి. ఆయనకు దాదాపు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది. పంచ కట్టుకుని ఠీవీగా, మనవలతో వచ్చాడు. కొవెలకుంట్ల నుంచి తిమ్మనాయుని పేటకు వెళ్లే బస్సు పేరుసోములలో ఆగుతుంది, అది వాళ్ళు ఎక్కాలి. ఓ అరగంట తరువాత బస్సు వచ్చింది… రద్దీగా లేదు అందరూ బస్సు ఎక్కారు… పెద్దాయన ఒకచోట కూర్చున్నాడు. ఆయన ముందు రాజా, విష్ణు కూర్చున్నారు. బస్సు ఖాళీగా ఉన్నా పెద్దాయన కూర్చున్న సీటుకు రెండు సీట్ల దూరంలో ఆ అబ్బాయి కూర్చున్నాడు. “రేయ్ నువ్వు కూర్చో కూడదు… నువ్వు నిలబడు” అని పెద్దాయన గసరగానే, తనకేనా చెబుతున్నది? లేదా వేరే వాళ్ళకా? అని అటూ ఇటూ చూశాడు. అక్కడ ఎవరూ లేరు. తనకే అని నిర్దారించుకున్న తర్వాత ‘ఎందుకు?’ అన్నట్టు చూసాడు ఆ పెద్దాయన వైపు. “మీరు తక్కువ కులం వాళ్ళు… నువ్వు కూర్చో కూడదు. రోజూ ఊరిలో చూడడం లేదా? మా ఎదురుగా మీ నాన్న గానీ, ఇతర పెద్దలు కానీ ఎప్పుడైనా కూర్చున్నారా? చిన్నా పెద్ద అనే సంప్రదాయం వుంది. దాన్ని ఎక్కడైనా పాటించాల్సిందే … ఊరయినా… bus అయినా” ఎదురు చెప్పకుండా లేచి నిలబడ్డాడు ఆ అబ్బాయి. బస్సు గతుకులుకు అటూ ఇటూ ఊగుతూ ఉంటే, సీట్ rodని పట్టుకొని అతి కష్టం మీద నిలబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు నిలబడమన్నాడో ? ఈ చిన్నా పెద్ద ఏంటో? ఈ కులం ఏంటో? ఏమీ తెలియని వయసు అది… అది ఏంటో అర్థం కాకపోయినా ఆ భయానికి ఎదురు చెప్పకుండా కష్టపడుతూ నిలబడ్డాడు ఆ అబ్బాయి. “టికెట్… టికెట్” అని కండక్టర్ పిలిచాడు. “ఒక టికెట్… తిమ్మానాయుని పేటకి” అన్నాడు అబ్బాయి. “సీటు ఖాళీగా ఉందిగా … కూర్చో !” అని బస్ కండక్టర్ అబ్బాయికి చెప్పాడు. “వాళ్ళు తక్కువ కులం వాళ్ళు … నా ఎదురుగా ఎలా కూర్చుంటారు?” అంటూ బస్ కండక్టర్ వైపు చూశాడు వెంకట్రాంరెడ్డి. కండక్టర్ ఇంక ఏం మాట్లాడలేదు. అరగంటసేపు కష్టపడుతూ నిలబడ్డాడు అబ్బాయి. ఇద్దరు మనవళ్ళు ఇదేం పట్టనట్టు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తిమ్మనాయుని పేటలో దిగి… అక్కడి నుంచి ఇంకొక బస్సు ఎక్కారు… ఆ బస్సు ఫుల్ గా ఉంది, ఎక్కడా సీట్లు ఖాళీ లేవు… అందరూ నిలబడాల్సి వచ్చింది. ఆ ప్రయాణం మొత్తం భారంగా సాగింది ఆ అబ్బాయికి. కొలిమిగుండ్ల బస్ స్టాప్ లో దిగి ఫోటో స్టూడియో కి నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళ అబ్బ, ఇద్దరు మనవళ్ళు మంచి బట్టలు, చెప్పులు వేసుకొని వున్నారు. ఈ అబ్బాయి స్కూల్ డ్రెస్ వేసుకుని వున్నాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. వారు ఫోటో స్టూడియోకు వచ్చేసరికి దాదాపు పన్నెండున్నర అవుతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ భగ భగ మంటుంది. “నువ్వు ఇక్కడే ఆగు, మేము లోపలికి వెళ్లి ఫోటో తీయించుకొని వస్తాము. నువ్వు పెద్ద కులం వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకూడదు” అన్నాడు ఆ పెద్దాయన. ఎక్కడ నిలబడాలి అనుకుంటూ అటూ ఇటూ చూసాడు ఆ అబ్బాయి. ఎక్కడా తలదాచుకోవడానికి వీసమెత్తు నీడ లేదు. కింద నల్లటి బండ పరుపుకి కాళ్ళు మాడిపోతున్నాయి. ‘ఆ అబ్బాయి విన్నాడా – లేదా? , ఆ ఎండలో వుండగలడా – లేదా? … బండలు కాలుతున్నాయి… అబ్బాయికి చెప్పులు లేవు’ ఇవన్నీ ఏమీ లేవు ఆ పెద్ద మనిషి మనసులో… ఆ ఆలోచన క్షణం కూడా రాదు వారి తలలో. కులం కట్టుబాటు అలాంటిది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ముద్ర వేస్తుంది. దాన్ని పాటించాల్సిందే. అతను చిన్నపిల్లవాడా… ముసలి వాడా… స్త్రీయా, పురుషుడా… మిట్ట మధ్యాహ్నమా… సాయంత్రమా… ఎండ వుందా… లేదా… చెప్పులున్నాయా లేదా… ఇవేమీ కనపడనీయదు కులం. ‘వాళ్ళు తక్కువ… వారు ఇళ్ళలోకి రాకూడదు’ – ఇవి మాత్రమే కనబడతాయి. జాలి, దయ, వారి హక్కులు, వాళ్ళూ మనుషులే అనే సమానభావం, వాళ్ళూ టిక్కెట్టుకు డబ్బులు కట్టారు, వాళ్ళూ ఫోటోకు డబ్బులు కడతారు, ఆ అబ్బాయి ఆయన మనుమళ్ళ లాగా బాగా చదువుతున్నాడు, చిన్న పిల్లవాడు – ఇవేం పట్టలేదు ఆ పెద్దమనిషికి. కులం కళ్ళనే కాదు మైండును కూడా ఆలోచించకుండా చేస్తుంది… ఆ పెద్ద మనిషికి, అలాంటి కోకొల్లలు మందికి కులం వల్ల మంచీ చెడు అన్న వివేకం లేకుండా పోయింది. అది కులం నైజం. వారి పిల్లలకు ఇంటి లోపల (ఇల్లు cum ఫోటో స్టూడియో) ఫోటో తీసుకొని… తీరిగ్గా బయటకి వచ్చేసరికి దాదాపు నలభై నిమిషాలు పట్టింది. అప్పటివరకు అలా ఎండలో పాదాలు మాడకుండా ప్రయత్నిస్తూనే వున్నాడు ఆ అబ్బాయి.

ఆ అబ్బాయి ఫోటో తీసుకున్న వెంటనే పెద్దమనిషి, వారి మనుమలిద్దరు, ఆ అబ్బాయి – నలుగురూ కలిసి అక్కడ దగ్గర్లో వున్న హోటల్ కి భోజనానికి బయలుదేరారు. అప్పటికి దాదాపుగా టైం రెండు కావస్తోంది. హోటల్ దగ్గర మళ్లీ అదే తంతు. “రేయ్, నువ్వు బయటే ఆగు, మేము తిని వస్తాము. తర్వాత నువ్వు లోపలికి వద్దువు” సల సల కాలిన పాదాలు, మండిపోయిన తల , చిన్న పిల్లవాడు తట్టుకోలేనంత ఆకలి. కానీ తప్పలేదు ఆ అబ్బాయికి. మళ్లీ ఒక గంట…! వాళ్లు తిని, తీరిగ్గా ఒక గంట తరువాత … దూరంగా ఒక మూలకు కూర్చున్నారు. హోటల్ ఆయన ఆ అబ్బాయిని పిలిచి, ఇంకో మూలకు ఒక చిన్న బెంచి మీద కూర్చోమన్నాడు. అది దాదాపు సగం బయటకు సగం లోపలకు వున్నట్టుంది. చేతులు శుభ్రంగా కడుక్కొని గబగబా కూర్చున్నాడు ఆ అబ్బాయి. భోంచేసి, భోజనం డబ్బులు కట్టి, బయటకి వచ్చాడు. భోజనం డబ్బులు మాత్రం అందరికీ ఒకటే రేటు. దాంట్లో ఏమీ తేడా లేదు.

ఎలాగోలా ఫోటోని తీసుకొని Jawahar Vidyalaya Selection Testకి అప్లై చేసాడు. ఒక రెండు నెలల తర్వాత results పేపర్లో వచ్చాయి. ఆ అబ్బాయికి గానీ, వాళ్ళ నాన్నకు గానీ ఆ విషయం తెలియలేదు. మరో ఇరవై రోజుల తరువాత, ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడంటూ… వచ్చి చేరమని వారి ఇంటికి లెటర్ వచ్చింది. “ఆ! ఏదో రిజర్వేషన్ వుంది కాబట్టి Navodaya లో సీటు ఆ అబ్బాయికి వచ్చిందిలే, లేదంటే మా వాళ్లకు నంద్యాలలో లక్షలు లక్ష లు పెట్టి కోచింగ్ ఇప్పించినా కూడా రాలేదు! వీళ్ళకి రిజర్వేషన్ వుంది కాబట్టి అన్నీ వస్తున్నాయి” ముసలాయన ఏడుపు. కులం బయట నిలబెట్టింది – తెలివితేటలు బడి లోపలికి తీసుకువచ్చాయ్, రాజ్యాంగం కల్పించిన అవకాశాల ద్వారా.

Leave a Reply

Your email address will not be published.

Translate »