సూర్యుడి వెలుగును ఆపతరమా?
2004
ఏప్రిల్ నెల … రెండవ వారం
నాందేడ్ రైల్వే స్టేషన్… మహారాష్ట్ర
సాయంత్రం సమయం … ఆకాశం అరుణ వర్ణంలో ఉంది … మబ్బులు నల్లగా కనబడుతున్నాయి.
Platform చివర ఒక cement bench
దాని మీద ఇద్దరం కూర్చొని వున్నాము . నాకు అప్పటికి 22-23 సంవత్సరాలు. మిలింద్ లోకండే గారికి నలభై దాటి ఉంటాయి. ఇద్దరం ticket checking officers… mufti లో ఉన్నాము .
నడుం చుట్టూ ticket checking కి సంబంధించిన leather bag . ఇద్దరి చేతిలో టీ గ్లాసులు వున్నాయి. అందులో అప్పుడే పోసిన వేడి టీ… దాన్నుండి వేడిగా ఆవిరి పొగలు వస్తున్నాయి. అప్పుడప్పుడే భానుడి ప్రతాపం కొద్దిగా తగ్గి చల్ల బడుతున్నట్లు ఉంది. ఆ సిమెంట్ బెంచ్ కూడా కొద్దిగా వేడిగానే ఉంది. వేడి వేడి టీ ని sip చేస్తూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము. టీ చాలా తియ్యగా వుంది మహారాష్ట్ర ప్రజల మనస్సులా. Platform మీదకి train రాబోతుంది. Squad లో వున్న TTE లు platform మీద కాచుకుని వున్నారు. టీ తాగడం పూర్తి అయ్యేలోపు ట్రైన్ వచ్చేసింది. టీ గ్లాస్ పక్కన పెట్టి బెంచ్ మీద నుండి పైకి లేచి అడుగు ముందుకు వెయ్యబోయాను… నా అడుగు ముందుకు పడలేదు… నేను చూసేది ఏంటో కూడా అర్ధం కాలేదు … వేల సంఖ్యలో జనం.
ఇసుక వేస్తే రాలనంత జనం…
విపరీతమైన జనం…
ట్రైన్ లో …
ట్రైన్ పైకప్పు పైన;
door దగ్గర;
door frame ను పట్టుకుని వేలాడుతూ;
bathroom దగ్గర;
భోగికి భోగికి మద్యలో ఉన్న coupling స్థలంలో;
ప్రతి ఇంచు, ప్రతి అనువు జనాలే.
Ticket check చెయ్యడానికి trains లోకి ఎక్కే అవకాశమే లేదు. అంత రద్దీగా వుంది.
పోనీ ఈ train కాకపోతే తరువాత train చూద్దాం అని ఆగాను నేను. తరువాత train కూడా అదే రద్దీ! పై కప్పు మీద భోగి లోపల; AC భోగీల్లో; స్లీపర్ భోగీల్లో; general compartments లో; ప్రతి చోట ఒకటే జనం. ఆడవారు, మగవారు, ముసలివారు, పిల్లలు వీరు వారు అని తేడాలేకుండా అన్ని రకాలయిన జనం. ఆ రోజు నుండి అన్ని రైళ్ళు అలాగే వున్నాయి. అర్ధం కాలేదు నాకు. ఇంతలా జనం ఎక్కడికి వెళ్తున్నారు. ఎందుకింత కిందా మీద పడి వెళ్తున్నారు. మదిలో ఒకటే ప్రశ్నలు
జనాల్ని గమనిస్తే మరీ ఎక్కువ డబ్బున్న జనం కూడా కాదు. చాలా మంది పేద వారు లేదా మద్య తరగతి వారు. ఒక వారం రోజులు ఇదే తంతు. ప్రతీ రోజు, ప్రతీ రైలు ఇలాగే నిండుగా వుంది. జనాలు విరగబడి వెళ్తూనే ఉన్నారు. ఇంకో వారం రోజులు తిరుగు ప్రయాణం. ఇప్పుడు reverse direction లో అన్ని రైళ్ళు పూర్తి గా జనాలతో నిండిపోయి వస్తున్నాయి.
ఎక్కడికి వెళ్ళారు ? ఎందుకు వెళ్ళారు? ఇంత మంది జనం ? లక్షల్లో ఉంటారు… పక్కనే ఉన్న మిలింద్ లోకండే సర్ ను చూసాను. ఆయన రైళ్ళను తనిఖీ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఆయన వెళ్తూ వున్న వారిని చూడ్డానికి, వారికి bye చెప్పడానికి వచ్చినట్టు ప్రశాంతంగా ఉన్నారు. ఇంక వుండబట్టలేక ఆయన్ని అడిగాను…
” సర్ , వీళ్లంతా ఎక్కడికి వెళ్తున్నారు ? “
” ఆప్ కో పతా నహీ హై క్యా ? యే తో అజీబ్ హై … అభీ తక్ ఆప్ కో పతా నహీ బోలేతో! సరే నేను చెప్తాను. “
” అన్నా! క్యా పడ్ రహా హై? “
” అంబేద్కర్ books , Imran “
” ఐసా పడే తో Health కరాబ్ ho జాయేగా! తోడ rest లేలో ! మై ఏక్ మహీనే సే దేక్ రహా హు ఆప్ కో , ఆప్ దిన్ రాత్ continiously పడ్ రహే హై, బినా rest. “
బుక్కులన్నీ నా చుట్టూ వున్నాయి. కొన్ని తెల్లకాగితాలు. వాటిలో notes వ్రాసుకుంటూ వున్నాను. పక్కన water bottle. అదే ప్రపంచం.
ఉదయం లేదు, సాయంత్రం లేదు continuous గా చదువుతూనే వున్నాను – ఏదో పూనకం వచ్చినట్టు. ఇలా దాదాపు సంవత్సరంన్నర చదివాను. అంబేద్కర్ గారు వ్రాసిన అన్ని పుస్తకాలను దాదాపుగా చదివాను.
నేను , Imran మరియు Ilaiah అందరం కలిసి ఒక రూమ్ లో వుండేవాళ్ళం. డ్యూటీ చేసుకొని రావడం, కలిసి వంట చేసుకోవడం వుండటం అదీ దినచర్య. ఒకొక్కరం ఒక్క పని చేస్తూ వంట చేసుకోవడం అలవాటు. ఒకరు పాత్రలు clean చేస్తే ఒకరు కూరగాయలు తీసుకురావటం , తరగటం , ఇంకొకరు వంట చెయ్యటం – ఇలా అందరం పనిని పంచుకుంటు చేసుకునేవారం.
ముందు అన్ని పనులు బాగా చేసేవాడిని. కానీ 2004లో మిలింద్ లోకండే గారితో Divisional Flying Squad (DFS) గా పనిచేస్తున్నప్పుడు ఎన్నడూ చూడని, ఎప్పుడూ తెలియని ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అప్పటి నుండి Dr. B.R. Ambedkar పుస్తకాలు ముందర వేసుకొని చదవటం మొదలు పెట్టాను. వంట/ help చెయ్యడం పూర్తిగా పక్కన పెట్టేశాను. Imran / Ilaiah ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వంట చేస్తున్నారు, ఎప్పుడు మళ్ళీ డ్యూటీ కి వెళ్తున్నారో కూడా తెలిసేది కాదు.
Imran చాలా సార్లు చెప్పి చూశాడు. ఆలా చదివితే ఆరోగ్యం పాడవుతుంది , మద్యలో gap తీసుకోమని. ఇవేవి నా చెవికెక్కలేదు. ఆ books అన్నిటిని complete చేసేంతవరకు నిద్ర కూడా పోవద్దన్నంత కసిగా చదువుతున్నాను “ఈయన ఇంతే ! మనం చెప్పడం waste !” Imran ఇంక చెప్పడం waste అని decide అయిపోయాడు.Imran Duty అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు పలకరించడం, తన పని తాను చేసుకోవడం తప్ప నన్ను disturb చెయ్యడం పూర్తిగా ఆపేశాడు.
ఆ రోజు అసలు ఏం జరిగింది ? మిలంద్ లోకండే గారు ఏం చెప్పారు?
Divisional Flying Squad (DFS) – మఫ్టీలో train లో తిరుగుతూ ticketless travelling మరియు ఇతర frauds ను కనిపెట్టి, వాటికి తగిన penalty (రైల్వే భాషలో దాన్ని Excess Fare అంటారు) విధిస్తూ వుండే Squad. నేను DFS లో పనిచేస్తూ వున్నాను. నెలకు ముప్పై వేల రూపాయలు రైల్వేకు ఆదాయం చూపించాలి. నాందేడ్ డివిజన్ లో DFS లో పనిచేస్తూ వున్నాను. టికెట్ చెకింగ్ స్టాఫ్ కు వివిధ రకాలయిన డ్యూటీస్ వుంటాయి. రైల్వే స్టేషన్ లో కానీ కార్యాలయంలో కానీ పనిచెయ్యడం, స్లీపర్/ AC Coaches లో conductor గా/ TTE గా పని చెయ్యడం, Squad లో పనిచేసి రైల్వేకి ఆదాయం సంపాదించి పెట్టడం. ఈ మూడవరకమైన Squads లో- అందులో DFS లో పనిచేస్తూ వున్నాను. Leather Bag ను నడుముకు చుట్టుకొని రైల్లో check చెయ్యడం , ఏదైనా ticketless travel గానీ, ఇతరత్రా fraud కానీ వుంటే వాటిని కని పెట్టడం. Fraud చేస్తున్న వారితో మాట్లాడి దానికి కట్టవలిసిన penalty (Excess fare) వసూలు చెయ్యడం. ఇది ticket checking staff పని.
“వీళ్ళందరూ నాగపూర్ లోని ధీక్ష భూమి కి వెళ్తున్నారు.”
మిలింద్ లోకండే గారు చెప్పుతూ వున్నారు… బాబాసాహెబ్ అంబేడ్కర్ birth anniversary ఏప్రిల్ 14వ తారీఖున ఉంది కదా ! అందరూ అక్కడికి వెళ్ళి ధీక్ష భూమి ని చూసి వస్తారు. కొన్ని లక్షల మంది ఏప్రిల్ 14 వ తారీఖున ఒక వారం ముందు నుండి అక్కడికి వెళ్తారు. ఒక వారం తరువాత వరకు తిరిగి వాస్తూ వుంటారు.
ఇప్పుడే కాదు సంవత్సరంలో మూడు సార్లు ఇలా లక్షల మంది అక్కడికి వెళ్ళడం , తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది.
- విజయదశమి పండుగ కి – అక్టోబర్ మాసంలో – ఎందుకంటే 1956 వ సంవత్సరం అశోక విజయదశమి పండుగ రోజు బాబాసాహెబ్ దీక్ష తీసుకున్నారు కాబట్టి.
- డిసెంబర్ 6 వ తేదీ – మహా పరినార్వాణ పొందిన (చనిపోయిన) రోజు కాబట్టి.
- ఏప్రిల్ 14th – జన్మ దినం కాబట్టి.
ఇరవై మూడు సంవత్సరాల వయస్సు వచ్చినా, 18 సంవత్సరాల లోపు Central government job- అది కూడా Indian Railways లో ఉద్యోగం సంపాదించినా , అంతకు ముందు మంచి స్కూల్లో – జవహర్ నవోదయ విద్యాలయ, కర్నూల్ లో తరువాత హైదరాబాద్ లో రైల్వే జూనియర్ కాలేజ్ లో చదివినా … మంచి మార్కులతో పాస్ అయినా … నాక్కూడా అంబేద్కర్ అంటే ఏవరో చూచాయిగా మాత్రమే తెలుసు కానీ, ఇంత మంది గుండెల్లో వుండే ఆరాధ్య దైవమని గానీ, ఆధునిక యుగంలోకి భారత దేశాన్ని నడపడానికి ఎనలేని కృషి చేసిన మహోన్నత నాయకుడని కానీ తెలియదు!
” సర్ , ఆయన గురించి ఎప్పుడూ స్కూల్లో గానీ , కాలేజీ లో గానీ పెద్దగా చెప్పలేదు. ఒకవేళ ఆయన గురించి చెప్పినా, చాలా క్లుప్తంగా , cursory గా చెప్పడమే చూసాను గానీ , ఇంత గొప్ప నాయకుడని తెలియదు. ఏ పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి పెద్దగా రాయలేదు. ఆయన గురించి తెలుసుకోవడం ఎలా ? నేను అంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు సహాయం చేస్తారా ?”
“ఏక్ కామ్ కరో ! బాబాసాహెబ్ రాసిన పుస్తకాలు నా దగ్గర వున్నాయి. అవి నేను మీకు ఇస్తాను. చదివి తిరిగి నాకు ఇవ్వండి. “
“ఇన్ని లక్షల మందిని చూసిన తర్వాత, వీరి అభిమానం , ప్రేమ చూసిన తరువాత ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది సర్. నేను మీ పుస్తకాలు చదివి, తిరిగి ఇస్తాను , నాకు ఇవ్వండి.”
” సరే “
మిలింద్ లోకండే గారు ఇచ్చిన పుస్తకాలు మోసుకుంటూ నా రూమ్ కి బయలుదేరాను.
కొన్ని ఏళ్ల తర్వాత – అమెరికా రాజ్యాంగం గురించి, దాన్ని అందరికీ చేరవేయడం గురించి వారు తీసుకునే చర్యల గురించి ఆలోచిస్తే నాకు మన రాజ్యరంగం గురించి, రాజ్యాంగ నిర్మాత గురించి తెలుసుకున్న సందర్భం గుర్తొచ్చింది.
“The National Constitution center brings together people of all ages and perspectives , across America and around the world , to learn about, debate, and celebrate the greatest vision of human freedom in the history, the US Constitution”
The Constitution Center ‘About’ page లో రాసివున్న మాటలు.
అమెరికా, వారి రాజ్యాంగం గురించి, రాజ్యాంగ నిర్మాతల గురించి – interactive Constitution అని, debate with thought leaders అని, educational programmes and online resourses అని చాలా activities చేస్తూ చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ వారి రాజ్యాంగం గురించి, దాని గొప్పదనం గురించి తెలియజేస్తూ వుంటుంది.
భారత రాజ్యాంగం గురించి ప్రతి పిల్లవాడు, ప్రతి భారతీయుడు చిన్ననాటి పాఠశాలలో తెలుసుకోవాలి, కానీ నాకు రైల్వే platform లో సంధ్యాసమయంలో అనుకోని పరిస్థితిలో తెలిసింది, బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం జరిగినట్టు.
ప్రతి ఒక్కరికి రైల్వే platform మీద తెలుసుకునే అవకాశం రాకపోవచ్చు. ప్రతి ఒక్కరికి మిలింద్ లోకండే లాంటి వ్యక్తులు దొరకక పోవచ్చు.
ఎలాగైనా అందరికీ తెలుస్తుంది అంబేద్కర్ గారి గురించి. ఏదో ఒకరోజుకు..
సూర్యుడి వెలుగును ఆపతరమా?