స్కూలు! ప్రిన్సిపాల్ !! ఓ అబ్బాయి !!!

స్కూలు!

ప్రిన్సిపాల్ !!

ఓ అబ్బాయి !!!

Jawahar Navodaya Vidyalaya,

Banavasi.

1997 సంవత్సరం….

Administration bloc కు ఎదురుగా రోడ్డు….

రోడ్డుకిరువైపుల చెట్లు….

అందులో ఓ చెట్టు కింద చిన్న అరుగు …

దాని మీద కూర్చొని వున్న Principal

SV Reddappa గారు….

ఆయనకు ఎదురుగా నిలబడి నేను, మా నాన్న….

“ ఇప్పుడు RRB VCRC (Vocational Course in Railway Commercial)కి select అయ్యామని, అందులో చేరితే

అది పూర్తయిన వెంటనే రైల్వేలో ఉద్యోగం ఇస్తారని , అందుకే వెళ్ళాలని అనుకుంటూవున్నారు. అది వీడి భవిష్యత్తుకు మంచిది కాదు.

Intermediate అయిపోగానే రైల్వే లో ఉద్యోగం వస్తుంది. కానీ అంత చిన్న వయస్సులో, ఏ టికెట్ కలెక్టర్ గానో ఉద్యోగం వస్తే… మళ్ళీ పై చదువులు చదవడం, వేరే మంచి ఉద్యోగానికి వెళ్ళడం చాలా కష్టం.

ఒకసారి చదువునుండి ఉద్యోగానికి వెళ్ళి, ఉద్యోగం చేస్తూ మళ్లీ చదవడం చాలా కష్టం. అలా చేసిన వాళ్ళు చాలా తక్కువ. మీకు ఏంత కష్టమయినా పరవాలేదు వీడిని ఎలాగోలా చదివించండి, వీడికి చాలా తెలివితేటలు వున్నాయి, మంచి భవిష్యత్తు వుంది. వీడిని రైల్వేలో Ticket Collector గా join చేసి, వాడి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు.

మీరు అలా చేస్తానంటే, నేను TC (Transfer Certificate) ఇవ్వను”.

ఖరాఖండిగా చెప్పేశారు Principal గారు.

“ నా ఆర్థిక స్థోమత వీడిని పై చదువులు చదివించడానికి సరిపోదు. చిన్నదో పెద్దదో వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఒక వేళ పై స్థాయికి చేరుకోక పోయినా, వాడి చిన్న ఉద్యోగం వాడికి వుంటుంది. వాడి జీవితాన్ని వాడు చూసుకోగలడు”.

నాన్న వేడుకోలు.

SV Reddappa గారు ఒప్పుకోలేదు.

నేను, నాన్న పంతం వీడలేదు.

మద్యే మార్గంగా మీరు వెళ్ళి Assistant Commissioner/Hyderabad Region తో Permission తెచ్చుకుంటే ఇస్తానని ఆయన చెప్పడం, మేము తంటాలు పడి Permission చెచ్చుకోవడం VCRC కోర్సులో Join అవ్వడం, తర్వాత Railwayలో Ticket Collector గా join అవ్వడం అలా జరిగిపోయాయి.

JNV, Banavasiలో నన్ను మా నాన్నను Principal SV Reddappa గారు టికెట్ కలెక్టర్ గా చేరవద్దని convince చేయడానికి ప్రయత్నం చేసిన దాదాపు ఓ పది సంవత్సరాల తరువాత-

Secunderabad Railway Station

Alpha Hotel దగ్గర….

మధ్యాహ్నం 3 గంటల సమయంలో….

డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాను. ఆల్ఫా హోటల్ దగ్గర కనబడ్డారు ప్రిన్సిపాల్ రెడ్డప్ప గారు. నేనెంతో అభిమానించే ప్రిన్సిపాల్ గారిని చూడగానే చాలా సంతోషం అనిపించింది.

పరిగెత్తుకుంటూ వెళ్లి “నమస్తే సార్”, “బాగున్నారా” అంటూ పలకరించాను.

వైట్ ప్యాంట్, TTE bag చూడగానే ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట-

“ఇంకా రైల్వేలోనే వున్నావా

నువ్వు ఈ పాటికే రైల్వెలో టీసీ ఉద్యోగం వదిలేసి ఇంకా మంచి ఉద్యోగానికి వెళ్లి వుంటావు అనుకున్నాను”.

నేను చెప్పాను కదరా, ఒకసారి చిన్న ఉద్యోగంలో చేరితే దానిని దాటుకొని ముందుకు వెళ్లడం కష్టం అని; నువ్వు నా మాట వినలేదు.

డబ్బుల్లేవు, ముందు ఏదో ఉద్యోగంలో చేరితే తరువాత చదువుకుంటాను అన్నావు; ఇప్పుడు చూడు అదే ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నావు. ముందు వున్నంత ఉత్సాహం కానీ, పట్టుదల కానీ వుండదు….”

ఆయన అలా చెప్పుకుంటూ వెళ్తున్నారు.

నా మనస్సు మొదటి వాక్యం దగ్గరే ఆగిపోయింది.

“ఇంకా రైల్వేలోనే వున్నావా?”

మనస్సు చివుక్కుమంది.. గుండెలో పెద్ద బాకుతో గుచ్చినట్లు అనిపించింది.

ఇద్దరం కలిసి పక్కనే వున్న పద్మజ హోటల్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఓ అరగంట మాట్లాడుకున్నాం. ప్రిన్సిపాల్ పోస్ట్ తరువాత ఆయన National Leadership Instituteలో జాయిన్ అయ్యిందీ, ఫ్యామిలీ గురించి, ఇంకా చాలా విషయాలు చెబుతూవున్నారు.

“నువ్వింకా రైల్వే లోనే వున్నావా ?” అన్న తరువాత నేను చేస్తున్న ఉద్యోగం గురుంచి ఏమి చెప్పాలనిపించలేదు నాకు.

మనస్సులో ఒక్కటే బాధ.

నేను VCRCలో చేరితే ముందు రైల్వేలో ఉద్యోగం వస్తుంది, తరువాత నేను ఇంకా చదివి లైఫ్ లో ముందుకు వెళతాను అని చెప్పి టీసీ తీసుకున్నాను.

ఇంకేముంది లైఫ్ సెటిల్ అయిపొయింది అనిపించింది. ఉద్యోగం చేస్తూవుండటం వల్ల డిగ్రీ డిస్టెన్స్ లో కంప్లీట్ చేశాను గానీ ఇంకా ఉన్నత స్థానం కోసం ప్రయత్నం చెయ్యలేదు. అప్పటికి కొంత complacency వచ్చేసింది. ఆయన చెప్పినట్లుగా టీసీ జాబులో ఇమిడిపోయివున్నాను.

Jawahar Navodaya Vidyalaya లు ఏర్పాటు చేసింది ఏదో అన్ని స్కూల్స్ లాగ చదువు చెప్పామా, అయిపోయిందా అని కాదు; ఇందులో చదివిన ప్రతి ఒక్కరు భవిష్యత్తులో పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయిలో వుండాలి. దేశ నాయకులుగా ఎదగాలి, కంపెనీస్ ఏర్పాటు చేయాలి అంతేగాని ఏదో చిన్న ఉద్యోగంలో చేరి మీ బ్రతుకు తెరువు మీరు చూసుకోవడం కాదు.

నా పిల్లలంతా అలా తయారయిన రోజు నేను నిజంగా గర్వపడే రోజు. ఏదో ఒక రోజు మీలో ఒకరు ఇదే విద్యాలయాలకు వీఎంసీ (VMC- Vidyalaya Management Committee. JNV VMC Chairperson గా జిల్లా కలెక్టర్ వుంటారు )చైర్ పర్సన్ గా రావాలి, మీరు ఆ వీఎంసీ చైర్ పర్సన్ గా వుంటే మీ దగ్గరికి నేను నవోదయాకు సంబందించిన ఫైల్ తీసుకుని రావాలి అదీ నా కోరిక.

జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది క్రమశిక్షణ. Discipline లేకపోతే నేను సహించను. రెండు మార్కులు తగ్గినా పరవాలేదు కానీ క్రమశిక్షణ లేకపోతే మాత్రం ఊరుకోను . ప్రిన్సిపాల్ ఎస్.వి. రెడ్డప్ప గారు ఎప్పుడు చెప్పే మాటలు. చెప్పడమే కాదు, ఆయన ప్రతి పనిలో ఆ Discipline అన్నది పాటించి చూపించేవారు. ఆయన జీవితం ఒక ఆదర్శం.

Jawahar Navodaya Vidyalaya, Banavasi, Kurnool జిల్లాకు మొదటి ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. వి. రెడ్డప్ప గారు. పది సంవత్సరాలు పైనే ప్రిన్సిపాల్ గా చేసి, అటు ఆ స్కూలుకు, ఆ కాలంలో చదివిన పిల్లలకే కాకుండా భవిష్యత్తులో రాబోవు ప్రిన్సిపల్స్/టీచర్స్ /పిల్లలకు మార్గదర్శనం చేసి వచ్చారాయన.

ఆ స్కూల్ నుంచి చాలా మంది ఉన్నత స్థానాలలో ఈరోజు వున్నారు. అదంతా ఆయన చలువే..

ఆయన కలగన్నట్టు VMC Chairpersonగా ఆయన ప్రిన్సిపాల్ గా వున్నప్పుడు ఎవరు కాలేక పోయినా, పక్కనె వున్న అనంతపురం జిల్లాకు నేను కలెక్టర్ గా (VMC Chairperson గా) వెళ్ళడం, అక్కడ ప్రిన్సిపాల్ గారు JNV Lepakshiకి సంబందించిన ఫైల్ తీసుకుని నా ఛాంబర్ కు రావడం ఒక మరిచిపోలేని అనుభూతి.

****

అలా ఆయన బాకుతో గుచ్చిన క్షణం నుండి నా mindకు అప్పటివరకు కమ్మిన మబ్బులు ఒకటొకటిగా విచ్చుకోవడం మొదలయ్యాయి.

అప్పటివరకూ అక్కడే ఆగిపోయి వున్నాను. అదే జీవితం అనుకొని వున్నాను.

అలా ఆయన గుండెల్లో బాకుతో పొడిచిన వెంటనే Civils కు ప్రిపేర్ అవ్వడం, అది క్లియర్ చెయ్యడం, మొదట ఆయనకే ఫోన్ చేసి ఆనందాన్ని పంచుకోవడం.. ఆత్మ సంతృప్తి నిచ్చే విషయాలు.

మనం దారి తప్పినా, జీవితంలో Compromise అయ్యి ఉన్నా విశ్వం మనకు ఇలాంటి సందర్భాలను కల్పించి అలాంటి మహానుభావులను పంపిస్తుందేమో.

అలాంటి గురువులందరికీ శతకోటి వందనాలు.

ఆయన కోరుకున్నట్లు సాధించాల్సింది ఇంకా చాలా వుందీ…..

మీ జీవితంలో జీవితగమ్యాన్ని మార్చిన ఇలాంటి సంఘటనలు /వ్యక్తులు ఉన్నాయా(రా)?

One thought on “స్కూలు! ప్రిన్సిపాల్ !! ఓ అబ్బాయి !!!

  • June 30, 2022 at 1:12 pm
    Permalink

    Surer anna . Myself Suresh 1998-2005 batch. Am chartered accountant anna

    Reply

Leave a Reply

Your email address will not be published.

Translate »